శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు..
వీరు గుడివాడ ప్రాంతపు కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు...
తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి మార్క్సిస్టు చూపునిచ్చిన దార్శనికుడు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాదులు వేసినవారు
వీరు కృష్ణాజిల్లా, పెదపారుపూడి మండలం, వెంట్రప్రగడ గ్రామంలో 1907లో జన్మించారు. వీరు విద్యార్థి దశలో జాతీయోద్యమంలో పాల్గొని దాని నుంచి కమ్యూనిస్టు ఉద్యమానికి వచ్చారు. వీరు ఇంజినీరింగ్ విద్యార్థిగా 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1932లో వ్యష్టి సత్యాగ్రహంలో పాల్గొన్న సందర్భంలో పోలీసులు ఇతడిని చిత్రహింసలు పెట్టారు. రెండేళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. జైలులోనే మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి అవగాహన చేసుకున్నారు. తన పంథా నిర్ధారించుకున్నారు. తనతోపాటు అనేక మంది యువకులను సమీకరించి పార్టీకి సుశిక్షితులైన సైనికుల్లా మార్చారు. పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి సత్యనారాయణ, చలసాని వాసుదేవరావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి తనదైన ముద్రతో పనిచేశారు. క్షేత్రస్థాయిలో పనిచేయడంతోపాటు ఓ మేధావిగా శైశవ దశలో కమ్యూనిస్టు పార్టీకి కొన్ని విషయాల్లో వీరు మార్గదర్శకం చేశారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం, మాతృదేశ దాస్య విముక్తి ఉద్యమాన్ని సమన్వయం చేసి పార్టీని నడిపించడంలో వీరు చూపిన మార్గమే దిక్సూచిలా నిలిచింది. సోవియట్ యూనియన్‌పై నాజీల దాడి నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న వైఖరికి జాతీయవాదుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఆంధ్ర కమ్యూనిస్టులు వీరి నాయకత్వాన సంయమనంతో ముందుకు సాగారు. సుభాష్‌చంద్రబోస్‌లాంటి పొరబడిన దేశభక్తులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడాన్ని తొలినుంచి ఇతడు వ్యతిరేకించాడంటే ఈయన ముందుచూపు, పరిస్థితులపై ఈయన అవగాహన స్పష్టమవుతోంది. వీరు రాసిన వ్యాసాలు 'గాంధీ-ఇర్విన్ నాటినుంచి జమీందారీ పోరాటం వరకు' కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయాలు ఏమిటో అర్థమవుతాయి. ఒక దశలో కమ్యూనిస్టు పార్టీపై జరిగిన కువిమర్శలను తిప్పికొట్టడంలో వీరు తన వ్యాసాలను ఆయుధాలుగా ఎక్కుపెట్టారు.
శ్రీ మద్దుకూరి చంద్రశేఖరరావు పాత్రికేయ జీవితం 1937లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన పత్రిక నవశక్తి సంపాదకునిగా ప్రారంభమయ్యింది. పార్టీ రహస్యపత్రిక స్వతంత్ర భారత్, 1942-45 మధ్య ప్రజాశక్తి వారపత్రి కకు, 1946నుంచి 1948 నిర్బంధ కాలంలో మూసివేసే వరకు ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులుగా పనిచేశారు. 1948లో అరెస్టు అయ్యారు. 1952లో విశాలాంధ్ర దినపత్రిక ప్రారంభంలో ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. 1964నుంచి68 వరకు సంపాదక వర్గంలో ఒకనిగా ఉన్నారు. ప్రగతి సచిత్రవారపత్రికకు 1969 నుండి 1974 వరకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించారు. జయభారత్, రెఢీ అనే రహస్య పత్రికలు ఇతడి నాయకత్వంలో నడిచాయి. ఇతని పత్రికారచన ఎంతో సులువుగా, సూటిగా, సరళంగా పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకొని సాగింది.
ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి వీరి చేసిన కృషి గణనీయమైంది. మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ ఇతని నాయకత్వంలో నిజమైన పోరాటం చేసింది. నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాహిత్యంపై కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొనడానికి వీరి చొరవే ప్రధాన కారణం. సోషలిస్టు భావాలను, మార్క్సిస్టు సిద్ధాంతాలను ప్రజల్లో ప్రచారం చేయడానికి, ప్రజల సమస్యలు వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి సాగే ఉద్యమాలకు ఊతంగా నిలవడానికి పత్రికల ద్వారా ఇతడు కృషి చేశారు. కమ్యూనిస్టు ఉద్యమాభివృద్ధికి, ప్రజాతంత్రశక్తుల సమీకరణకు తన వ్యాసాలు, సంపాదకీయాల ద్వారా ఇతడు తపించారు. 1951నుంచి 56వరకు రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. వీరు ఏనాడు పదవుల్ని ఆశించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పదవుల కన్నా పార్టీ నిర్మాణమే ముఖ్యమని నమ్మారు. 1952లో రాజ్యసభకు పంపాలని పార్టీ నిర్ణయిస్తే సున్నితంగా తిరస్కరించారు. పార్టీలో ముఠాతత్వానికి నిరసనగా అన్ని బాధ్యతలు వదిలి కర్నూలు వెళ్లి సామాన్య రైతు జీవితం గడిపారు. అక్కడ కూడా సామాన్య కార్యకర్తగా పార్టీ నిర్మాణానికి కృషిచేశారు. వీరు గుడివాడ ప్రాంతపు కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులు...
(((((((((((((((((((((((((((₹
స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు జర్నలిజం పితామహులు మద్దుకూరి చంద్రశేఖరరావు గారి 37వ వర్ధంతి సందర్భంగా స్మారక సభ జులై 30వ తేదీన విజయవాడ చంద్రంబిల్డింగ్స్‌లో జరిగే సందర్భంగా సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్రరాజేశ్వర రావు, చంద్రం గారి సంస్మరణ సభలో చేసిన ప్రసంగాన్ని ఇక్కడ ఇస్తున్నాం...స
దాదాపు 40 సంత్సరాలుగా చంద్రం గారితో నాకు పరిచయం ఉంది. 1937 నుండి వారి సహచరుడుగా వుంటూ వచ్చాను. మేమంతా రాష్ట్ర కమిటీలో ఉన్నప్పటికీ వారిని మేమంతా పెద్దగా గౌరవిస్తూ ఉండేవాళ్ళం. మన ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీకి పునాదిరాయి వేసిన వారిలో వారొకరు. శ్రీ సుందరయ్య, శ్రీ కంభంపాటి సత్యనారాయణ, శ్రీ చలసాని వాసుదేవరావు మొదలగువారితో పాటు చంద్రంగారు కూడా మన ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేశారు. అప్పటి నుండి వారిజీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితం చేశారు. నిస్వార్థంగా నిరాడంబరంగా వారు సేవ చేశారు.
జాతీయోద్యమ సాంప్రదాయాలు
కమ్యూనిస్టు ఉద్యమానికి వారు తీసుకొని వచ్చిన కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా అనేకమంది యువకులు జాతీయోద్యమాలలో పాల్గొన్నవారు చాలామంది మనరాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. వారందరికీ కూడా జాతీయోద్యమం యొక్క మంచి సాంప్రదా యాలున్నందువల్ల, వారు స్వయంగా ఆకళింపు చేసుకున్నందు వలన ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు ఉద్యమంలోకి వాటన్నిటినీ తీసుకొని వచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్నుండి కూడా అక్కడ జాతీయోద్యమానికి నాయకత్వం వహిం చిన వారందరూ దాదాపు నూటికి 90 మంది కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. శ్రీ నారా యణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల లకీëనరసింహా రెడ్డి, సర్వదేశభట్ల రామనాథం, దేవులపల్లి వెంకటేశ్వరరావు యిత్యాదులందరూ కూడా జాతీయోద్యమం నుండి వచ్చినవారే. అయితే వీరందరూ కమ్యూనిస్టు ఉద్యమంలోకి 1940 ప్రాంతాలలో వచ్చారు. కాని చంద్రంగారు 1934 ప్రాంతాలలోనే వచ్చారు.
నవయుగ వైతాళికుల సుసంప్రదాయాలు
అదేవిధంగా మన ఆంధ్రుల యొక్క సుసాంప్ర దాయాలు ముఖ్యంగా నూతన యుగానికి వైతాళికులుగా ఉన్న వీరేశలింగం పం తులుగారు, గురజాడ అప్పారావుగారు చిలకమర్తి లకీëనరసింహంగారు గిడుగు రామమూర్తి పంతులుగారు మొదలైన వారంతా ఆంధ్రదేశంలో ఆధునిక యుగానికి ప్రారంభోత్సవం చేశారు. వారి సుసాంప్ర దాయాలను మన కమ్యూనిస్టు ఉద్యమంలోకి తీసుకురావడంలో చంద్రంగారు చాలా పెద్ద పాత్ర నిర్వహించారు. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే తరువాత కమ్యూనిస్టు ఉద్యమంలో అనేకమైన ఘట్టాలు వచ్చాయి. ఒడుదుడుకులు కూడా వచ్చాయి. ఈ సందర్భంలో చంద్రంగారి యొక్క ఈ అనుభవం, అంటే జాతీయోద్యమం యొక్క అనుభవం, జాతీయోద్యమాన్ని అర్ధం చేసుకోవడంలో ఆంధ్రదేశంలో వున్న కమ్యూనిస్టు ఉద్యమానికి ఎంతో తోడ్పడ్డారు. అనేక ఘటనలు తరువాత వచ్చాయి.
సాంస్కృతిక పునరుజ్జీవన : పార్టీ కృషి
ఆంధ్ర కమ్యూనిస్టు ఉద్యమానికి మొదటినుండి ఒక ప్రత్యేకత ఉంది. కేరళవంటి కొన్ని రాష్ట్రాలలో ఉంది. ఏమిటంటే భారతదేశం యొక్క నాగరికత గురించికాక ఆ రాష్ట్ర ప్రజలయొక్క నాగరికత, సంస్కృతి, సాహిత్యం మున్నగువాటి పట్ల శ్రద్ధ తీసుకొనే విషయం, ఈ విషయంలో ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమం మొదటి నుండి శ్రద్ధ తీసుకుంది.
ఉదాహరణకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మున్నగువారి గురించి అసలు అందరూ మర్చిపోయిన స్థితిలో ఏ కాలేజీలోనైనా కందుకూరి వీరేశలింగంగారు ఎవరంటే ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది. నవయుగాంధ్ర వైతాళికుల రచనలను ఆవిధగా పాతిపెట్టేయడం జరిగింది.
1943లో వారి రచనలన్నింటినీ బైటికి తీశాం. వీరేశలింగం పంతులుగారి జీవితచరిత్ర, ప్రహసనాలు, వారి ఉత్తమమైన నాటకాలు, తిరిగి బైటకుతీసుకొని వచ్చాం. అట్లాగే గురజాడ అప్పారావుగారి ముత్యాల సరాలు-వారి కన్యాశుల్కం అందరికి తెలుసు. కాని, ఆయన వ్రాసిన ముత్యాల సరాలు గురించి జనబాహుళ్యం అందరికీ తెలియదు. అయితే సాహితీవేత్తలకు తెలుసుననుకోండి. వాటిని తీసిచూస్తే మాకం దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఏవి కమ్యూనిస్టు సిద్ధాంతాలని మేము అనుకుంటూ వచ్చామో అవి సూచనప్రాయంగా గురజాడ అప్పారావుగారు ముత్యాల సరాల్లో చక్కగా అందరికీ అర్థమయ్యేట్టు ఉన్నాయి. అవన్నీ మేము అచ్చువేస్తే ఆ రోజుల్లో కొన్ని వ్యాఖ్యానాలు కూడా వచ్చాయి. ఆ రోజుల్లో బహుశా జన్మభూమి అనుకుంటాను. ఆ పత్రికలో -''అసలు ఇవన్నీ అప్పారావుగారు వ్రాశారా? ఆయన ఏవో కొన్ని వ్రాస్తే కమ్యూనిస్టులు వాళ్ళ యిష్టం వచ్చినట్లు ఇవన్నీ కల్పించి వ్రాశాడు'' అని వ్రాసి పడవేశారు.
చిలకమర్తి వారి స్వీయచరిత్ర ప్రచురణ
అదేవిధంగా ఆ రోజుల్లో చిలకమర్తి లకీëనరసింహంగారు తమ వృద్ధాప్యంలో చాలా అవస్థలు పడుతున్న సమయంలో-తిండికి కూడా యిబ్బంది పడుతున్నప్పుడు, ఆయన స్వీయచరిత్ర ప్రచురించి, ఆయనకు ఆ రూపేణా ధనసహాయం చేయాలనుకున్నాం. కాని ఆయనకు ఎవరో ''కమ్యూనిస్టులు చాలా దుర్మార్గులు, వాళ్ళు అచ్చు వేసుకుంటారు. కానీ, డబ్బు మాత్రం యివ్వరు'' అని చెప్పారట. అందువలన ఆయన మొదట తన స్వీయచరిత్ర అచ్చు వేయడానికి యివ్వలేదు. అప్పుడు రాష్ట్ర కమిటీ తరపున వెళ్లి ఆయనకు వెయ్యిరూపాయలు యిచ్చి దానిని అచ్చువేసి ఆయనకు విజయవాడలో సన్మానం చేయటం జరిగింది.
తరువాత ఆయన ఆచరణలో కమ్యూనిస్టులు ఎటువంటివారో, ఎటువంటి నిజాయితీపరులో అర్దంచేసుకొని సన్మానసభలో అనేక విషయాలు చెప్పారనుకోండి. నేరు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రదేశానికి, ఆంధ్రదేశం మంచికి, ఆంధ్రప్రజల సంస్కృ తి మొదలైన వాటన్నింటికోసం కమ్యూనిస్టుపార్టీ చాలా త్యాగాలు చేసిందని నేను సగర్వంగా చెప్పుకోగల్గుతాను.
చంద్రంగారి ఆదర్శ గుణగణాలు
చంద్రంగారి గుణగణాల గురించి తెలిసిన వారు చాలామంది ఉన్నారు. ఆయన గురించిన సంస్కృతులు చాలా ఉన్నాయి. నేను కొన్నిటి గురించి మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి.
లెనిన్ మహాశయుడు-ఆయన గుణగణాలు చాలా గొప్పవి. ఆయన పెద్ద సిద్ధాంతవేత్త. అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఆయన మహా విప్లవాన్ని చాకచక్యంగా నడిపారు. సాధించారు. మన చంద్రంగారికి అటువంటి అవకాశం దక్కకపోయినప్పటికీ లెనిన్ గారి జీవిత చరిత్ర గురించి ఏ గొప్ప గుణగణాలున్నాయని మనం చదువుకున్నామో చంద్రంగారితో అటువంటి గుణగణాలన్నింటిని మేము చూడగల్గాం. (హర్షధ్వనాలు) ఇంతపెద్ద జీవితంలో ప్రతివ్యక్తి ఏవోకొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. ఏ పొరపాట్లు చేయడని నేను ఆనుకోను. చంద్రంగారు చనిపోయిన తరువాత, మరోసారి ఆయనతో నాకు గల 40 ఏళ్ళ సహచర్య జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి చూసినప్పుడు, నాకు మాత్రం ఏదీ దొరకలేదు. మానవునికి అనేక అపేక్షలుంటాయి. ఆవిదంగా ఉండటం తప్పుకాదు. కాని వాటిని సాధించడానికి తప్పు పద్ధతులు అవలంబిస్తే మాత్రం అది తప్పు. ఈ 40 ఏళ్ళ సహచర్య జీవితంలో ఆయనలో ఎటువంటి స్వార్థంకాని, లేక ఉద్యోగ అపేక్షగానీ,-ఇటువంటి ఏకోశానా నాకు కనబడలేదు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య : పదవులు
బూర్జువా ప్రజాస్వామ్య సంస్థలలో స్థానం లేనంతవరకు కమ్యూనిస్టుపార్టీకి ఉద్యోగాపేక్ష ప్రమాదం ఏదీ సోకలేదు. కాని 1952 నుండి కూడా చాలా పెద్దయెత్తున అటువంటి అవకాశం వచ్చింది. అదొక నూతన యుగం. ఈ నూతన దశలో కమ్యూనిస్టు ఉద్యమానికి పెద్దగా అనుభవాలు లేవు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఈ బూర్జువా ప్రజాస్వామిక సంస్థలయొక్క అనుభవంలేదు. ఆ సందర్భంగా మా నల్గురిలో అంటే సుందరయ్యగారు, నేను, చంద్రంగారు, బసవపున్నయ్యగార్లలో ఎవరు ఎక్కడకు వెళ్ళాలి? ఏ బాధ్యతలు వహించాలి? అన్నప్పుడు సుందరయ్యగారు. బసవపున్నయ్యగార్లను పార్లమెంటులోను, సన్ను శాసనమండలిలోను ఉండమన్నారు. చంద్రంగారు కూడా రాజ్యసభకు వెళ్లాలన్న ప్రతిపాదన వచ్చింది. కాని చంద్రంగారు ''నేను ఎందుకయ్యా దాంట్లో? కె.ఎల్. నరసింహంగారిని పంపితే ఉపయోగపడుతుంది'' అన్నారు. ఆ ప్రకారంగానే కె.ఎల్. నరసింహంగారు అప్పుడు రాజ్యసభకు వెళ్ళారు. అది రైల్వే పనివారల ఉద్యమానికి ఉపయోగపడింది. అలా మొదట నుండి ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంస్థలలో పదవులకు, అట్టి వ్యామోహానికి దూరంగా ఉంటూ వచ్చారు. చంద్రంగారిలో అట్టి వ్యామోహం ఏకోశానాలేదు. ఇట్టి వ్యామోహం నేడు కమ్యూనిస్టు ఉద్యమంలో లేకపోలేదు. ఈ బూర్జువా ప్రజాస్వామ్య యుగంలో అటువంటి అవలక్షణాలు అంటనివారు కొందరున్నారు. ఈ విషయంలో కూడా ఆయన నిప్పులా ఉండగల్గారు.
మంచి కమ్యూనిస్టు అనేవాడు ఎలా వుండాలి? అనే విషయమై లీషావ్‌చీ ఒక పెద్ద పుస్తకం వ్రాశారు. మార్క్స్, లెనిన్, ఏంగిల్స్ మొదలైన వారి జీవితాలు చూస్తే మంచి కమ్యూనిస్టు అనేవాడు ఎలా ఉండాలో అర్థ అవుతుంది. చంద్రంగారి జీవితం తీసుకున్నప్పటికీ ఆ విషయం అర్థమవుతుంది. దాంట్లో ఏమీ సందేహంలేదు.
పార్టీ ఐక్యతకోసం చంద్రంగారి కృషి
ఇక శిక్షణ విషయంలో ఆయనకు ఆయనే అందెవేసిన చేయి. ఏ ఒక్క సమయంలో కూడా ఆయన-పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించలేదు. పార్టీ యొక్క ఐక్యతను కాపాడటం కోసం మన చంద్రంగారు చాలా కృషి చేశారు. రాష్ట్ర కమిటీలో తీవ్ర అభిప్రాయబేదాలు వచ్చినప్పుడు, చంద్రంగారు ఏదోవిధంగా సర్ది, ఆయన అభిప్రాయాలను కూడా ప్రక్కన బెట్టుకొని రాష్ట్ర కమిటీని ఐక్యంగా ఉంచడానికి కృషి చేశారు.
ఆ రోజుల్లో జైలులో కూడా చాలా అభిప్రాయ భేదాలొచ్చాయి. 1948-52 ఉద్యమంలో కమ్యూనిస్టు పార్టీలో అట్టి అభిప్రాయభేదాలు చాలా వచ్చినాయి. ఆ ఉద్యమాన్ని చివరికంటా యీడ్చడం వలన అవి వచ్చాయి. అందువల్ల చాలా నష్టం వచ్చింది. జైలులో కూడా తీవ్ర అభిప్రాయ భేదాలుంటే ఆ నాల్గు గోడల మధ్య ఒకరికొకరు చూసుకొనే పరిస్థితులు లేనప్పుడు-అది కడలూరు జైలు అనుకుంటాను. అప్పుడు ఆ జైలులో ఉన్న చంద్రంగారు దానిని చాలా ఐక్యంగా నిర్వహిం చారు. ఆ తరువాత పెరోల్ మీద జైలు నుండి బైటికి వచ్చి తప్పుకొని మళ్ళీ రహస్య జీవితానికి వెళ్ళారు. ఆ విధంగా ఎంతో శిక్షణను ఆయన కల్గి వున్నారు.
సామాన్య పార్టీ సభ్యునిగా చంద్రంగారి జీవితం
ఒక్క ఘటనను మాత్రం చెప్పాలి. నాయకుడు అన్నవాడు సామాన్య పార్టీ సభ్యుడుగా ఉంటం మాత్రం చాలా కష్టసాధ్యమైన విషయం. కాని చంద్రంగారు మాత్రం అది సాధ్యమని ఆచరణలో రుజువు చేశారు. ఎందుకంటే నాయకుడుగా ఉన్నవాణ్ణి తొలగించినప్పుడు అనేక అవలక్షణాలను ప్రదర్శించిన వారున్నారు. అసలు ఇటువంటివారు నాయకత్వంలో ఇన్నాళ్ళు ఎలా వున్నాడా? అని అనిపించేటట్లు ప్రవర్తించినవారు కూడా ఉన్నారు.
కాని పార్టీలో ముఠాతత్వం వచ్చిన తరువాత చంద్రంగారు ఒక నిశ్చయానికి వచ్చారు. ఇక తాను పార్టీని ఐక్యంగా ఉంచలేను ముఠాతత్వాలలో మాత్రం పాల్గోలేదు అని స్పష్టంగా రాష్ట్ర కార్యవర్గంలోను, రాష్ట్ర కౌన్సిల్‌లోను కూడా చెప్పారు. అప్పుడు తన భార్య పేర ఉన్న కొద్దిపాటి భూమి అమ్మి- తన పేర ఉన్న భూమిని ఎప్పుడో పార్టీకి యిచ్చి వేశారనుకోండి-కర్నూలు జిల్లా వెళ్ళిపోయి అక్కడ కొంత భూమికొని, సాగుచేసి, స్వయంగా దున్ని, డోకి ఆవిధంగా వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఒక చిన్న పార్టీ యూనిట్‌ను నిర్మించారు.
అందులో సామాన్య పార్టీ సభ్యులుగా ఉంటూ ఆవిధంగా శిక్షణాయుతంగా తన జీవితాన్ని గడిపారు. ఇది మనందరకు శిరోధార్యమైన విషయం. చంద్రంగారి గుణగణాలు చెప్పాలంటే యింకా చాలా వున్నాయి.
మేమంతా ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన గుణగణాలను ప్రత్యక్షంగా చూశాం. నామట్టుకు నేను ఈవిషయంలో ఆయనను ఎల్లప్పుడూ ఆదర్శంగా పెట్టుకొని ఉన్నాను.
No comments:
Post a Comment