Thursday, October 22, 2020

శ్రీ తమ్మారెడ్డి కృష్ణమూర్తి

 తమ్మారెడ్డి కృష్ణమూర్తి
స్వర్ణోత్సవం జరుపుకున్న ‘రవీంద్ర ఆర్ట్‌ పిక్చర్స్‌’ సంస్థ ద్వారా ఎన్నో మంచి, సందేశాత్మాక, విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ‘పెద్దాయన’ తమ్మారెడ్డి కృష్ణమూర్తి. చిత్ర పరిశ్రమ వర్ధిల్లడానికి తన వంతు కృషిని అహర్నిశలు చేసిన మహామనిషి. ఆయన వివరాలు స్ఫూర్తిదాయకం.

* నేపథ్యం...

1920 అక్టోబర్‌ 4న జన్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి అసలు పేరు గోపాలకృష్ణమూర్తి. కృష్ణా జిల్లా చినపాలపర్రు కృష్ణమూర్తి స్వగ్రామం. కమ్యూనిస్టు భావాలు పెనవేసుకున్న యువకునిగా ప్రజానాట్యమండలి ద్వారా అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, స్వాతంత్య్ర పోరాటంలో తన వంతు కృషి చేసిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి మద్రాసు నగరం చేరి బతుకుతెరువు కోసం సినీ నటుల పిల్లలకు పాఠాలు చెబుతుండేవారు. అలా పరిచయమైన సినిమా పరిశ్రమ కృష్ణమూర్తి ప్రతిభను వదులుకోలేదు. దర్శకులు తాతినేని ప్రకాశరావు పీపుల్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను నెలకొల్పి ఎన్‌.టి.ఆర్‌. సావిత్రిలతో తొలి ప్రయత్నంగా నిర్మించిన ‘పల్లెటూరు’ (1952) చిత్రానికి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా కృష్ణమూర్తి పనిచేశారు. సారథి స్టూడియోతో కృష్ణమూర్తికి అనుబంధం పెరిగింది. 1955లో సారథి ఫిలిమ్స్‌ నిర్మించిన సంచలన చిత్రం ‘రోజులమారాయి’కి తాపీ చాణక్య వద్ద ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు. సారథి స్టూడియో హైదరాబాద్‌ నగరంలో ఉండటంచేత తన మకాం హైదారాబాద్‌కి తరలించి సారథి స్టూడియో నిర్వాహణ బాధ్యతలు చేపట్టారు. స్టూడియోకి క్రమంగా జనరల్‌ మేనేజర్‌గా, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగి హైదరాబాద్‌లో చిత్ర నిర్మాణ పరిశ్రమ ఎదుగుదలకి కృషి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా ఉండే ‘ఫిలిం నగర్‌’ వ్యవస్థాపకులు తమ్మారెడ్డి కృష్ణమూర్తి అని తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మద్రాసు నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కి తరలిరావాలంటే, అటు కళాకారులకి, ఇటు నిర్మాతలకీ మౌలిక వసతులు ఉండాలని సంకల్పించి ‘ఫిలిం నగర్‌’ సొసైటీని స్థాపించి, కొండలు గుట్టలుతో నిండివున్న ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఇప్పుడు దాన్ని ఒక ‘టాలీవుడ్‌ హాలీవుడ్‌’ఘా తీర్చిదిద్దిన ఘనత తమ్మారెడ్డి కృష్ణమూర్తిది.

* రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ ఆవిర్భావం...

1962లో స్వంత చిత్ర నిర్మాణ సంస్థను తమ్మారెడ్డి నెలకొల్పారు. రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అని పిలిచే ఈ సంస్థ చిహ్నాన్ని విశ్లేషిస్తే తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆశయస్ఫూర్తి అర్థమౌతుంది. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అంటే కృష్ణమూర్తికి అవ్యాజమైన అభిమానం. రవీంద్ర చిత్ర బ్యానర్‌ మీద మొదట కనపడేది రవీంద్రుని రేఖాచిత్రం. ఈ చిత్రంలో ఇమిడిపోయిన మరో చిత్రం శృంఖాలాలను తెంచుకొని చెయ్యెత్తి చూపుతూ ‘‘స్వాతంత్య్రం, శాంతి, అభ్యుదయం... మీ నివాళి మా ధ్యేయం’’ అంటూ నినదించే కార్మికుని ఆవేశభరిత గర్జన. ఈ లోగో చాలు తమ్మారెడ్డి కృష్ణమూర్తి ఆశయ సిద్ధి ఎలాంటిదో బేరీజు వెయ్యడానికి. ‘‘సారథి స్టూడియో నాకు విశ్వవిద్యాలయం. సకలం నేర్పిన నా తల్లి సారథి’’ అని అందరికీ చెప్పేవారు కృష్ణమూర్తి. ఆయన నిరాడంబరత ఎలాంటిదంటే, శ్రీనగర్‌ కాలనీ నుంచి సారథి స్టూడియోకి నడిచి వెళ్తుండేవారు. తెలిసిన వాళ్లెవరైనా లిప్టు ఇస్తామంటే ‘‘లేదండీ. నేను వాకింగ్‌ చేస్తున్నా. మీరు వెళ్లండి’’ అనేవారు. రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్‌ కింద మొదటి ప్రయత్నంగా ‘లక్షాధికారి’ అనే అపరాధ పరిశోధక చిత్రాన్ని తమ్మారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం 1963 సెప్టెంబర్‌ 27న విడుదలైంది. ఎన్‌.టి.ఆర్‌., కృష్ణకుమారి జంటగా ఈ చిత్రాన్ని వి.మధుసూదనరావు దర్శకత్వంలో టి.చలపతిరావు సంగీత నిర్వహణలో రూపొందించారు. మధుసూదనరావు, చలపతిరావు ఇద్దరూ ప్రజానాట్యమండలి సభ్యులు కావడం విశేషం. చిత్రం బాగానే ఆడింది. ఆ సమయంలో ‘నర్తనశాల’, ‘మంచీ-చెడు’, ‘తోబుట్టువులు’ వంటి ఎన్‌.టి.ఆర్‌ చిత్రాలు విజయవంతంగా ఆడుతుండడంతో ‘లక్షాధికారి’ చిత్రం 11 వారాల ప్రదర్శనకు మాత్రమే నోచుకుంది. కానీ చిత్రానికి మంచిపేరు వచ్చింది. ఈ చిత్రం తరువాత వరుసగా అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణంరాజు, రంగనాథ్‌లతో చిత్రాలు నిర్మించారు. అవే: ‘జమీందార్‌’, ‘బంగారు గాజులు’, ‘ధర్మదాత’, ‘సిసింద్రీ చిట్టిబాబు’, ‘దత్తపుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’, ‘చిన్ననాటి కలలు’, ‘అమ్మ-నాన్న’, ‘లవ్‌ మ్యారేజ్‌’, ‘ఇద్దరు కొడుకులు’ చిత్రాలు. ‘జమీందార్‌’ చిత్రానికి వి.మధుసూదనరావు; ‘బంగారుగాజులు’ చిత్రానికి సి.ఎస్‌.రావు; ‘ధర్మదాత’, ‘సిసీంద్రి చిట్టిబాబు’ చిత్రాలకు ఎడిటర్‌ అక్కినేని సంజీవి; ‘దత్తపుత్రుడు’, ‘డాక్టర్‌ బాబు’, ‘చిన్ననాటి కలలు’, ‘అమ్మానాన్న’, ‘లవ్‌ మ్యారేజ్‌’ చిత్రాలకు తమ్మారెడ్డి కృష్ణమూర్తి పెద్దకుమారుడు లెనిన్‌బాబు దర్శకత్వం వహించారు. అనారోగ్య కారణాల చేత లెనిన్‌ బాబు అకాలమరణం చెందగా 1976 తర్వాత చిత్ర నిర్మాణం కొంతకాలం ఆగిపోయింది. తరువాత కట్టా సుబ్బారావు దర్శకత్వంలో ‘ఇద్దరు కొడుకులు’ చిత్రాన్ని 1982లో తీసారు. అక్కినేని సంజీవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి వంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత తమ్మారెడ్డి కృష్ణమూర్తికి దక్కుతుంది.
                                                                                                                                                           

No comments:

Post a Comment

గుడివాడ చరిత